Leading News Portal in Telugu

Rohit Sharma: అతడు ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!


  • గంభీర్‌పై రోహిత్ ప్రశంసలు
  • గంభీర్‌ తలవంచే రకం కాదు
  • అందుకే టీ20లకు వీడ్కోలు పలికా
Rohit Sharma: అతడు ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా చివరి వరకూ పోరాడాలనే బలంగా భావిస్తాడన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం చాలా బాగుందని రోహిత్ పేర్కొన్నాడు. మొన్నటివరకు రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు గంభీర్‌తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా జియో సినిమా ఇంటర్వ్యూలో గంభీర్‌ గురించి రోహిత్ మాట్లాడాడు.

‘మొన్నటివరకు భారత జట్టుకు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పనిచేశాడు. ఇప్పుడు గౌతమ్‌ గంభీర్‌ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదు. చివరి వరకూ పోరాడాలనేదే అతడి భావన. దేశం కోసం ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడిన వ్యక్తితో నేను ఇప్పుడు కలిసి పని చేస్తున్నా. నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్‌గా నా బాధ్యత. సహచరుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తెప్పించాల్సిన అవసరం ఉంది’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

‘ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం చాలా బాగుంది. ఒకరికొకరం స్ఫూర్తి నింపుకుంటున్నాం. ప్లేయర్స్ మధ్య మంచి స్నేహం ఉంది. జట్టు సమతూకంగా ఉంది. టీ20లకు వీడ్కోలు పలికేందుకు సరైన సమయం అదేనని భావించే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడగలను. గత 17 ఏళ్లుగా టీ20లు ఆడుతూనే ఉన్నా. జట్టులో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. వారికి అవకాశం రావాలి’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.