- నరేంద్ర మోడీని గద్దె దింపేవరకూ చనిపోను
- మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

MalliKarjuna Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు. వేదికపై ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోబోగా.. ఆయన పక్కనున్న భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు సకాలంలో ఆయన దగ్గరకు వెళ్లి పట్టుకున్నారు. మంచి నీళ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని కొంతసేపు నిలిపివేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఖర్గే ఎమోషనల్ అయ్యారు. ఆరోగ్యం బాగోలేక మాట్లాడలేకపోతున్నానని కార్యకర్తలను క్షమించమని కోరారు. ప్రస్తుతం తనకు 83 ఏళ్ల వయసు అని.. ఇప్పుడప్పుడే తాని చనిపోనంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీపీ తగ్గిపోవడంతో అలా జరిగినట్లు, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపాయి. జమ్ముకశ్మీర్ మూడో విడత పోలింగ్ రేపు(అక్టోబర్ 1) జరగనుంది.