posted on Oct 13, 2024 7:48PM
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడన ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల సోమవారం నాడు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది. ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెయిన్ అలెర్ట్ జారీ చేశారు.
• సోమవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది.
• బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
• నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం.
• భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్.కు దూరంగా ఉండాలి.
• బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు.
• మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు.
• పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలి.
• వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా వుంది. అందువల్ల పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.