Leading News Portal in Telugu

Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..


  • ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం

  • రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం..

  • ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

  • అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా..

  • అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం.
Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీంతో.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24 నాటికి మరొక వాయుగుండం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్టోబర్ 24, 25న ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశ ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతల్లో గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అలర్ట్ చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు.. విశాఖ జిల్లా కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.