Leading News Portal in Telugu

రోజా.. గురువింద సామెత | roja convineantly forget past| criticise pawan| cbn| shoot| cinema


posted on Oct 22, 2024 11:43AM

మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే  రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలో ఉన్నంత వరకూ ఆయనా, ఆయన కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలూ మంచీ చెడు, మర్యాద, సభ్యత వంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలతో దాడి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యంగా రోజా పవన్ కల్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు తెగబడ్డారు. సరే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. స్వయంగా రోజా తన నగరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచీ రోజా ఆంధ్రప్రదేశ్ కంటే చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒక దశలో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ జబర్దస్త్ గా కామెడీ షోలకు జడ్జిగా షిఫ్టైపోతారని కూడా వినిపించింది. అయితే ఓటమి పాలైన నాలుగు నెలల తరువాత ఆమె మళ్లీ  రాజకీయాలలో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా ముందుకు వచ్చి… పవన్ కల్యాణ్, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. ఇంతకూ ఏ విషయంపై ఆమె తన నోటికి పని చెప్పారంటే.. చంద్రబాబు అన్ స్టాపబుల్ టాక్ షో కోసం షూటింగ్ లో పాల్గొనడం, పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం తప్పని ఆమె విమర్శిస్తున్నారు. షూటింగ్ లలో పాల్గొనే వారికి రాజకీయాలెందుకని ప్రశ్నించారు. మరి గత ఐదేళ్లుగా రోజా చేసిందేమిటని ఆమెను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. అయినా రోజా వంటి వారికి అనడమే తప్ప వినడం తెలియదని పరిశీలకులు అంటున్నారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా  రోజా ప్రజా సమస్యల విషయంలో ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు గానీ, జబర్ దస్త్ కామెడీ షోకు జడ్జిగా ఆమె నిత్యం యమాబిజీగా ఉండేవారు. మంత్రి అయిన తరవాత జబర్ దస్త్ కు పేరుకే దూరం జరిగారు కానీ మళ్లీ పండగల సమయాలలో స్పెషల్ షోలకు మేకప్ తో సిద్ధమైపోయారు. తాను అధికారంలో ఉన్నసమయంలో ఏం చేశారో మరచిపోయి ఇప్పుడు  చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల షూట్ ల గురించి మాట్లాడటంతోనే రోజా తీరు గురివింద సామెతను గుర్తు చేస్తోందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. అయినా తప్పులెన్నటమే తెలిసిన వారికి తమ తప్పులు కనిపించవని వేమన ఎప్పుడో చెప్పారు.