Leading News Portal in Telugu

PM Modi- Xi Jinping: ఐదేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ


  • నేడు కజాన్‌లో ప్రధాని మోడీ- జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ..

  • ఐదేళ్ల తర్వాత భారత్- చైనా మధ్య తొలి అధికారిక సమావేశం..

  • తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంపై ఒప్పందం తర్వాత ఈ భేటీ..
PM Modi- Xi Jinping: ఐదేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ

PM Modi- Xi Jinping: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమ్మిట్ కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కీలక పరిణామాన్ని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇక, గాల్వాన్ వ్యాలీ ఘర్షణ నుండి ఉద్రిక్తతలు కొనసాగుతున్న తూర్పు లడఖ్‌లో ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్‌పై ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 2019 తర్వాత ఇరు దేశాలకు చెందిన ఈ అగ్రనేతలు ఇద్దరూ పరస్పర ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత వీరిద్దరూ పరస్పర ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనలేదు. ఇక, 2022లో బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2023 బ్రిక్స్ సదస్సుల్లో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసినప్పటికీ ద్వైపాక్షిక అంశాలపై పెద్దగా చర్చలు జరపలేదు. ఈ రెండు సందర్భాల్లోనూ కేవలం మాట్లాడుకున్నారు. అయితే, 2023 బ్రిక్స్ సదస్సులో సైనిక ప్రతిష్టంభనకు పరిష్కార ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువురు అంగీకరించారు. దీంతో ఈరోజు జరిగే సమావేశంలో ఏయే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.