- నేడు వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్..
- భారీ బహిరంగ సభ ఏర్పాటు
- హాజరు కానున్న సీనియర్ నేతలు.

Wayanad Bypoll 2024: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్‌ను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నామినేషన్‌కు ముందు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ వాయనాడ్ ప్రజలకు బలమైన నాయకురాలిగా ఎదుగుతారని నేను విశ్వసిస్తున్నాని తెలిపారు.
ఇకపోతే, మరో వైపు ప్రియాంక గాంధీపై వాయనాడ్‌లో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్‌ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ స్థానంలో సత్యం మొకేరిని సీపీఐ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే, ఈ బలమైన స్థాననికి కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీకి ఎక్కువ బలం ఉన్నట్లు కనపడుతోంది. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు, ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ, అమేథీలలో గాంధీ కుటుంబానికి సంబంధించిన బలమైన స్థానాలను చూసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేసిన ఆమె తొలిసారి ఎన్నికల పోరులోకి దిగుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వాయనాడ్ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించారు. వాయనాడ్‌కు రాజీనామా చేస్తూ తన తల్లి వారసత్వం రాయ్‌బరేలీ సీటును కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారని స్పష్టమైంది.