Leading News Portal in Telugu

Pannun Murder Plot: పన్నూన్‌ను చంపడానికి కుట్ర.. అప్పటి వరకు సంతృప్తి లేదంటున్న అమెరికా


  • పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్‌ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి..

  • బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు అమెరికా సంతృప్తి చెందదు: యూఎస్ విదేశాంగశాఖ ప్రతినిధి
Pannun Murder Plot: పన్నూన్‌ను చంపడానికి కుట్ర.. అప్పటి వరకు సంతృప్తి లేదంటున్న అమెరికా

Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్‌ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ తెలిపారు. దాదాపు వారం క్రితమే భారత్‌ చర్యలపై అదే శాఖకు చెందిన మరో ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కూడా తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం. వేదాంత్ పటేల్‌ మాట్లాడుతూ.. విచారణలో కచ్చితమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొనే వరకు అమెరికా సంతృప్తి చెందదు అని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫలప్రదమైన చర్చలు జరిగాయి.. మా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సమాచారాన్ని ఇరు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. అంతకుమించి సమాచారం తెలిపేందుకు ఆయన నిరాకరించారు.

ఇక, గత ఏడాది నవంబరులో న్యూయార్క్‌లోని ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను హతమర్చడానికి చేసిన ప్రయత్నాలను భగ్నం చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు భారత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాటిల్లో ఇండియన్ గవర్నమెంట్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌, మాజీ రా చీఫ్‌ సుమంత్‌ గోయల్‌, రా ఏజెంట్‌ విక్రమ్‌ యాదవ్‌, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్‌ గుప్తా పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది. మరోవైపు, ఉగ్రవాది పన్నూన్ మాత్రం అమెరికా నుంచే భారత్‌పై బెదిరింపులకు దిగుతున్నాడు. ఇటీవల నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు.