Leading News Portal in Telugu

Telangana CM Revanth Reddy Is Shocked By The Death Of Padma Shri Gussadi Kanakaraj


  • అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన గుస్సాడీ కనకరాజు..

  • గుస్సాడీ నృత్య కళాకారుడు
  • పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

  • గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించిన సీఎం..
Gussadi Kanakaraj: గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Gussadi Kanakaraj: గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటని తెలిపారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని.. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు(70) శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి పండగ ముందే మరణించడంతో ఆదివాసీ గూడెల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గానూ 2021లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేసింది.