Leading News Portal in Telugu

High Speed Rail Corridor to Reduce Travel Time Between Shamshabad-Vizag To 4 Hours


  • శంషాబాద్‌- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌..

  • గంటకు 220 కి.మీ. వేగంతో ట్రైన్ ప్రయాణం..

  • విశాఖపట్నం- సూర్యాపేట- కర్నూలు మధ్య మరో కారిడార్‌..
Shamshabad-Vizag Train: ప్రయాణికులకు శుభవార్త.. 4 గంటల్లోనే శంషాబాద్ టూ వైజాగ్

Shamshabad-Vizag Train: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. శంషాబాద్‌- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఫిక్స్ అయింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించబోతున్నారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ సర్వే చివరి దశకు చేరకుంది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తుంది.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే. ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి ఎయిర్ పోర్టులను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందిస్తుండటం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తుంది. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అలాగే, వందే భారత్‌ 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది.

అయితే, సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు మార్గాల్లో ట్రైన్స్ నడుస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఉండగా.. రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాల్లో వెళ్తుంది.. ఈ రూట్స్ లో వెళ్లే రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలో మీటర్లు మాత్రమే ఉంది. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా వచ్చే శంషాబాద్‌- వైజాగ్ మార్గం దగ్గరవుతుంది. వేగం దాదాపు రెట్టింపై కావడంతో.. ప్రయాణ సమయం సగానికి తగ్గిపోతుంది.