సమన్వయంతో పని చేస్తే విజయమే.. చంద్రబాబు | work with coordination| kutami| parties| make| sure| mlc| elections| win| cbn| teleconference| party
posted on Oct 26, 2024 12:51PM
కూటమి పార్టీల మధ్య సమన్వయం చాలా ముఖ్యం అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గుంటూరు, కృష్ణా జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ లను ప్రకటించామన్నారు. ఈ అభ్యర్థుల ఎంపికలో ఆ నాలుగు జిల్లాలలోని నేతల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్నామన్నారు.
గ్యాడ్యుయేట్ల ఓట్ల నమోదు విషయంలో పూర్తి శ్రద్ధపెట్టాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలన్నారు. కూటమి నేతలతో కోఆర్డినేషన్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో 93శాతం స్థానాలలో విజయం సాధించడానికి కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగడం కారణమని చంద్రబాబు వివరించారు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా రేయింబవళ్లు పని చేస్తున్నామన్న ఆయన పని చేయడం ఎంత ముఖ్యమో దానిని ప్రజలలోకి తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వంలో ఉండి పనులు చేయడమే కాదు ఆ పనుల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా ముఖ్యమన్నారు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఈ నాలుగు నెలల్లో ప్రజల కోసం తీసుకువచ్చిన విధానాలు, పథకాలపై ప్రజలలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే డీఎస్సీ ప్రకటించాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు 6 పాలసీలు తీసుకొచ్చాం. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్ ఫస్ట్ విధానంతో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్నాం. అలాగే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగుతున్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు శ్రమిస్తున్నాం. వీటన్నిటినీ ప్రజలకు వివరించాలని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ఎప్పుడూ లేని విధంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాం. వీటన్నిటినీ ప్రజలలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ఇక ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పని చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.