Leading News Portal in Telugu

AP Government’s decision to put the YCP Government Old GOs on the website


  • కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..

  • వైసీపీ సర్కార్‌ హయాంలోని జీవోలను వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయం..

  • 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకు..

  • గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు..
AP Government: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లోకి పాత జీవోలు..!

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్‌ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్..

ప్రస్తుతం జీవోఐఆర్ వెబ్ సైట్ ను పునరుద్ధరించటంతో పాత జీవోలన్నీ అప్ లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఉత్తర్వులనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది ప్రభుత్వం.. 2008 నుంచి ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ వెబ్ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్న సర్కార్.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకూ మాత్రమే ఉత్తర్వులు అందుబాటులో లేకుండా పోయాయని.. వాటన్నింటినీ అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది.. మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. ప్రభుత్వం అధికారిక నిర్ణయాలు, జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయని తెలిపింది.. సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వ సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున జీవోలు వెబ్ సైట్ లో ఉంచటం వల్ల సదరు దరఖాస్తులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.. గడచిన మూడేళ్ల కాలంలో అప్ లోడ్ కాని జీవోలను జీవోఐఆర్ వెబ్ పోర్టల్ లో ఉంచాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.. రెండు నెలల్లో ఆ మూడేళ్ల కాలానికి చెందిన జీవోలన్నీ అప్ లోడ్ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచనలు చేసింది ప్రభుత్వం..