Leading News Portal in Telugu

Bangladesh ex-PM Sheikh Hasina’s palace to be converted into revolution museum


  • విప్లవ మ్యూజియంగా షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్..

  • బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం..
Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..

Bangladesh: బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్యాలెస్ ‘‘విప్లవ మ్యూజియం’’గా మారుతుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సోమవారం తెలిపారు. హసీనాకు చెందిన విలాసవంతమైన ప్యాలెస్ నుంచి ఆమె పారిపోయేలా చేసిన విప్లవానికి గుర్తుగా ఈ మ్యూజియం మారుతుందని యూనస్ చెప్పారు. ఈ మ్యూజియంలో ఆమె దుర్మార్గమైన పరిపాలన, ఆమెను అధికారం నుంచి తొలగించిన ప్రజలు విప్లవాన్ని భద్రపరుస్తుందని చెప్పారు.

రిజర్వేషన్ కోటాపై హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. షేక్ హసీనా 15 ఏళ్ల పాలనలో ఆమె రాజకీయ ప్రత్యర్థుల సామూహిక నిర్భంధం, చట్టవిరుద్ధంగా హత్యలు, మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని, ఇటీవల బంగ్లాదేశ్ కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనా రాజీనామాకు ముందు పోలీసులు క్రూరమైన అణిచివేతలో 700 మందికి పైగా మరణించారు.

షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా మైనారిటీలు, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేశారు. హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేయడంతో పాటు పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఉగ్రవాదుల్ని జైలు నుంచి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధాన్ని ఎత్తి వేశాడు.