Leading News Portal in Telugu

బాలినేని.. మనిషొక చోట.. మనసొక చోట! | balineni cant criticize jagan| trouble| support| cbn| pawan| pressmeet


posted on Oct 29, 2024 11:28AM

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ మాజీ నాయకుడు. అన్నిటికీ మించి జగన్ కు సమీప బంధువు. ఆయన ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి జనసేన గూటికి చేరారు. అయినా ఆయన మానసిక బంధం ఇంకా జగన్ తోనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 28) మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి లైవ్ లో ఆయన పడిన ఇబ్బంది కళ్లకు కట్టినట్లు కనిపించింది. అలాగే తాను ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటా తడబడుతూనే వచ్చింది. మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ఆస్తుల తగాదా విషయంపై మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు వింటే మనిషి జనసేనలోనూ మనసు వైసీపీతోనూ ఉందని పించేలా ఉన్నాయి. 

వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతలు, శ్రేణులపై సాగించిన దాష్టికాలు, దౌర్జన్యాలూ ఇన్నీ అన్నీ కావు. అందుకే ఆయన జనసేన గూటికి చేరుతున్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన కార్యకర్తలూ ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు.  అయితే పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో గట్టిగా మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులూ మౌనం వహించాయి.

ఇక  సోమవారం (అక్టోబర్ 28) ఆయన మీడియా ముందు ఎలాంటి శషబిషలూ లేకుండానే తాను వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషినని చెప్పుకున్నారు. అంతే కాదు షర్మిల, జగన్ ల మధ్య ఆస్తుల వివాదంపై తన వైఖరి ఏదో స్పష్టంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ కు విమర్శిస్తూ ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసేలా ఆయన తీరు ఉంది. షర్మిలతో ఆస్తి వివాదంలో వైసీపీ చంద్రబాబు పేరు లాగడం కరెక్టు కాదు అన్న మాట కూడా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మద్దతుగా ఆయన గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. దీంతో  బాలినేనిపై తెలుగుదేశం, జనసేన శ్రేణులలో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన జనసేన గూటికి చేరడం వెనుక కూటమి ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందా అన్న సందేహాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి.  

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ బాలినేని ఆరోపించడమే కాకుండా,  ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలంటూ ఈసీని కోరారు. మొత్తంగా బాలినేని తాజా మీడియా మీట్ లో బాలినేనిలోని వైసీపీ అనుకూలత ప్రస్ఫుటంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.