Leading News Portal in Telugu

తెలుగుదేశం కూటమి సర్కార్ కు కరెంట్ షాక్? | current shack to tdp sarkar| charges| hike| people| oppose| jagan| sarkar| wrong


posted on Oct 30, 2024 11:34AM

ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి విద్యుత్  షాక్ తగలక తప్పదా?  2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్  కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే.  చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో  తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పడమే కాకుండా,  వీలయితే 30శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

కాని ఇప్పుడు ఏపీఈఆర్సీ కి చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది మోసమని, ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాలని వినియోగదారులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.న వంబర్ నెల నుంచి యూనిట్ రూ.1.58 అదనపు భారం వినియోగదారులపై పడనుందని తెలుస్తున్నది. అయితే ఈ పెంపునకు గత వైసీపీ   ప్రభుత్వ  నిర్వాకమే కారణమని తెలుగుదేశం కూటమి పార్టీలు చెబుతున్నాయి. అయితే విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తున్నది.  అసలే ధరలు పెరిగి సామాన్యుడు విలవిలలాడుతుంటే  విద్యుత్ చార్జీలు పెంచి మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని జనం అంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపు పాపం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు విధానాలను అవలంబించిన వైసీపీదేనని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే వామపక్షాలు మాత్రం  ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ప్రబలేందుకు దోహదం చేస్తుందని అంటున్నాయి.  వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ భారం ఇప్పటి కూటమి ప్రభుత్వానికి గుదిబండలా మారిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలోనే నిధుల సమీకరణ ఎలా అని మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు సర్కార్ కు విద్యుత్ భారాన్ని కూడా మోయడం అంటే తలకు మించిన భారమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో ఈ విద్యుత్ షాక్ బారిన పడకుండా చంద్రబాబు సర్కార్ ఎలా బయటపడుతుందో చూడాలి.