Leading News Portal in Telugu

Will launch ‘Operation Budameru’ to prevent flooding of Vijayawada in future: CM Chandrababu


  • వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో పూర్తి చేయాలి..

  • బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం..

  • బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం..
Chandrababu: బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం

Chandrababu: బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాల పరిస్థితిని తెలుసుకున్నారు. ముందుగా అధికారులు ప్రభుత్వం సహాయంపై సీఎంకి వివరించారు. మొత్తం 4,21,698 మందికి రూ.625 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కేవలం 70 మందికి మాత్రమే ఇంకా పరిహారం అందలేదని.. అది కూడా వారి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వల్లనే సమస్య వచ్చిందన్నారు.

మరో 200 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయని వాటిలో అర్హులకు ప్రభుత్వ సాయం అందిస్తామని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేసిందన్నారు. గతంలో ఇంత మొత్తంలో సాయం చేసిన సందర్భం లేదన్నారు. చివరి బాధితుడి వరకు ప్రభుత్వ సాయం చేరుతుంది.. ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు నష్టపోయిన వాహనదారులకు బీమా చెల్లింపు దరఖాస్తుల్లో ఇంకా 262 పెండింగులో ఉండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విశాఖలో హుదుద్ తుపాన్ వచ్చిన సమయంలో కేవలం నెల రోజుల్లోపే బాధితులకు బీమా సొమ్మును అందించామన్నారు. ఆ తరహాలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

ఇక, భవిష్యత్తులో బెజవాడకు వరద ప్రమాదం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి తక్షణం డీపీఆర్ రూపొందించాలన్నారు. కాలువ గట్లకు, కరకట్టలకు గండ్లు పండకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలి.. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు సంబంధించి కేంద్ర నుంచి నిధులు గ్రాంటు రూపంలో వస్తాయి.. ఆ నిధులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఆ ప్రాంత ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి వారికి శాశ్వత పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. వరదల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణం విడుదల చేయాలని వెల్లడించారు. వరదల వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా చూశానని సీఎం చంద్రబాబు వెల్లడించారు.