Leading News Portal in Telugu

Maharashtra Polls Nominations of 7,994 Candidates Across 288 Assembly Seats Found Valid


  • మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు..

  • 7994 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు..

  • అధికారంలోకి వచ్చేం దుకు యత్నిస్తున్న మహాయుతి- మహావికాస్ కూటములు
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు

Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 921 మంది నామినేషన్ పేపర్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ అక్టోబర్‌ 22వ తేదీన ప్రారంభమై 29తో ముగిసింది. అక్టోబర్‌ 30వ తేదీన నామినేషన్‌ పత్రాల పరిశీలన కూడా పూర్తైంది. అభ్యర్థిత్వాల ఉప సంహరణకు నవంబర్ 4వ తేదీ లాస్ట్.

కాగా, 288 మంది శాసన సభ్యులున్న మహారాష్ట్రలో నవంబరు 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్)లతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

అయితే, మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో తొలి ఓటర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా.. 4.6 కోట్ల మంది ఉమెన్స్ ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక, శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగిపోయింది అని ఈసీ తెలిపింది.