4శతాబ్దాల నాటి శివాలయ శిథిలాలను కాపాడుకోవాలి! | preserve 400 years year old shivalaya ruins| pleach india| ceo| emani
posted on Nov 1, 2024 4:44PM
సానంబట్లలో విజయనగర కాలపు శిధిలాలు
పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, సానంబట్ల గ్రామంలో స్వర్ణముఖీ నది ఒడ్డున 400 ఏళ్ల నాటి శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధిపతి, ప్రముఖ రచయిత, పేటశ్రీ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు సానంబట్ల శివారులోని సువర్ణముఖీ నది పరిసరాలను గాలించి, క్రీ.శ. 16-17 శతాబ్దాల నాటి ఒక ఫర్లాంగు పొడవు, అడుగున్నర వెడల్పు గల రాతికోట గోడ ఆనవాళ్లు, వరదలకు నేలమట్టమైన శివాలయ శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రగిరి నుంచి వెంకటపతి రాయలు పాలిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మట్ల అనంతరాజు ఆధీనంలో ఉండేదని, విజయనగర రాజభటుల శిబిరం ఇక్కడ ఉండేదని, రాను రాను, సైన్యం భట్టుల గ్రామం సానంభట్ల అయిందని పేటశ్రీ చెప్పారు.
ఇక్కడ సైనిక శిబిరముందనటానికి, నదికి ఎడమ గట్టునున్న కోట గోడ శిధిలాలే ఆధారమని, శివాలయముందనటానికి, ఆలయ పునాదులు, పడిపోయిన గోడలు, స్తంభాలు, కప్పురాళ్లు, ఇటుక, సున్నంతో కట్టిన శిఖరం ఆనవాళ్లు తెలియజేస్తున్నాయనీ, ఆలయ విడి భాగాలపై విజయనగర కాలపు శిల్పాలు, చక్కటి నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల విజయనగరం కాలానికి చెందిన పడిపోయిన కోటగోడలు, ఆలయ శిథిలాలను పునరుద్ధరించి, భావితరాలకు అందించాలని గ్రామ సర్పంచి ముడిపల్లి సురేష్ రెడ్డికి సానంబట్ల గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, ప్రకాష్, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.