Leading News Portal in Telugu

కర్నాటకలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మంగళం? | karnataka goodbye to free bus travel scheme for women| burden| review


posted on Nov 1, 2024 10:24AM

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలలో భాగంగా రేవంత్ సర్కార్ అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే. అంతకు మందే కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ హామీ ఎంతో దోహదపడింది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు బ్రెయిన్ చైల్డ్ గా ఈ పథకాన్ని చెబుతారు. కర్నాటక ఫలితాన్ని చూసిన తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మహిళలకు టీజీఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కాగా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కానుగోలే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చింది. 

అయితే కర్నాటకలోకి సిద్దరామయ్య సర్కార్ తమ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని రద్దు చేసే యోచనలో ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ పథకంపై సమీక్షించి కొనసాగించే విషయంలో ఒక  నిర్ణయానికి వస్తామని ప్రకటించడమే.  ఈ పథకం వల్ల ఆర్టీసీ మీదే కాకుండా రాష్ట్ర ఖజానా మీద కూడా మోయలేని భారం పడుతోందన్నారు. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కంటే టికెట్లు కొనుక్కుని ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారని, అందుకే ఈ పథకాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నామనీ డీకే శివకుమార్ వివరించారు. 

ఇక మళ్లీ తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందనీ, దీంతో టికెట్లు కొనుక్కుని బస్సులో ప్రయాణం చేసే వారికి సీట్లు దొరకడం సంగతి అటుంచి కనీసం కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేని పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు.  అయితే ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కర్నాట సర్కార్ తమ రాష్ట్రంలో ఈ పథకం రద్దు చేసే యోచనలో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా ఈ పథకం కొనసాగింపుపై పునరాలోచన చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.