Leading News Portal in Telugu

Ambati Rambabu visiting Sahana’s family members and who presented Rs. 10 lakhs check


  • గుంటూరు జిల్లా తెనాలిలో సహన కుటుంబ సభ్యులకు పరామర్శ..

  • గతంలో రూ10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన వైఎస్ జగన్..

  • ఆ కుటుంబానికి చెక్క్ ను అందజేసిన అంబటి రాంబాబు..
Ambati Rambabu: సహన తల్లిదండ్రులకు జగన్‌ భరోసా.. రూ.10 లక్షల చెక్కు అందించిన అంబటి..

Ambati Rambabu: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీట‌ర్ న‌వీన్ దాడితో బ్రెయిన్‌డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్రంలో మ‌హిళలు, చిన్నారుల‌పై హ‌త్యలు, అత్యాచారాలు దారుణంగా పెరిగిపోయాయని విమర్శించారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకున్న మహానుభావులు ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు స్పందించరని ఆయ‌న ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీట‌ర్ న‌వీన్ దాడి చేయ‌డంతో బ్రెయిన్‌డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులను అంబటి రాంబాబు ప‌రామ‌ర్శించారు. ఐతాన‌గ‌ర్‌లోని స‌హ‌న నివాసం వ‌ద్దకు వెళ్లిన అంబ‌టి రాంబాబు.. మృతురాలి త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించి వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్రక‌టించిన 10 ల‌క్షల రూపాల‌య చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ, సహన తల్లిదండ్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు 10 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అందిస్తున్నామ‌ని చెప్పారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని.. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. సహనకు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించటంలో కూడా విఫలం అయ్యారని విమ‌ర్శించారు. త‌న బిడ్డ సహన మృతికి ముగ్గురు కారణం అని తల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారని.. అయితే ఒక్కరే సరండర్ అయ్యారని మిగతా ఇద్దరిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని త‌మ‌కు సమాచారం అందుతుందని ఆరోపించారు అంబటి రాంబాబు..