Leading News Portal in Telugu

CM Chandrababu and Home Minister Vangalapudi Anitha on Undrajavaram Incident


  • తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి..

  • విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..

  • మృతుల కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన..
Undrajavaram Incident: విద్యుదాఘాతంతో నలుగురు మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

Undrajavaram Incident: తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు..

ఇక, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత.. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకునే ధైర్యం వారి తల్లిదండ్రులకు భగవంతుడు ప్రసాదించాలని వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి కాపాడాలని వైద్యాధికారులను ఆదేశించారు హోం మంత్రి అనిత.