Leading News Portal in Telugu

PM Netanyahu office is accused of leaks to thwart Gaza ceasefire full details are


  • హమాస్‌ – హెజ్‌బొల్లా గ్రూప్‌లను అంతం చేయాలని లక్ష్యంగా బెంజమిన్‌ నెతన్యాహు..
  • గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారంలో .
  • ప్రధాని సన్నిహితులే రహస్య సమాచారం లీక్‌ చేశారని..
Gaza-Israel War: గాజా కీలక దస్త్రాల లీకేజీ..  నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాలు ఆగ్రహం

Gaza-Israel War: హమాస్‌, హెజ్‌బొల్లా గ్రూప్‌లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్‌ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్‌స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. బందీలను విడిపించే ప్రక్రియకు దీనివల్ల తీవ్ర ఆటంకం కలిగి ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో బందీల కుటుంబాలు నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నెతన్యాహు మాత్రం తమ కార్యాలయంలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్తున్నారు. మీడియాలో వచ్చిన వార్తల వల్లే ఈ లీకేజీ గురించి తనకు తెలిసిందని వెల్లడించారు. సెప్టెంబర్‌లో హమాస్‌ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలను దక్షిణ గాజాలోని రఫాలో గుర్తించిన విషయం తెలిసిందే. బందీల మృతి వార్త.. ఇజ్రాయెల్‌లో అలజడి రేపింది. ప్రధాని నెతన్యాహుపై విపక్షాలు, బందీల కుటుంబాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి నెతన్యాహుయే కారణమని ఆరోపించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ కీలకపత్రాల సమాచారం యూరోపియన్ మీడియా సంస్థలో ప్రచురితమైంది. అందులో హమాస్‌ చర్చల వ్యూహాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం మధ్యవర్తులు యూఎస్‌, ఖతర్, ఈజిప్టు చర్చల్లో తలమునకలై ఉన్న సమయంలో అది వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌ పై హమాస్‌ దాడి చేయడంతో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్‌ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. దాంతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ప్రతిదాడుల్లో గాజాలో 43వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో కొందరు బందీలు విడుదల కాగా.. ఇంకా 101 మంది హమాస్‌ చెరలోనే ఉన్నారు. అయితే, పలు ఘటనల్లో కొందరు బందీలు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. నెతన్యాహు బందీల జీవితాలతో జూదం ఆడుతున్నారని మరో మీడియా సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది.