Leading News Portal in Telugu

గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు | kalipatnam master a man stood for values| kathanilayam| telugu


posted on Nov 4, 2024 3:52PM

కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి.  శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఎచ్చెర్ల) ఉప కులపతి కె.ఆర్. రజని పాల్గొన్ని ప్రసంగించారు.  అక్షరమే దైవంగా భావించిన కారా మాస్టారి జీవితం, చేసిన రచనలు ఎన్నటికీ ఆదర్శనీయమని రజజని అన్నారు. జ్ఞానం, విజ్ఞత, విలువలు, ధీరత్వం వంటి సుగుణాలు కారా మాస్టారు నుంచి నేటి తరం గ్రహించాలని, ఇవి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలన్నారు. తల్లి లాంటి మాతృభాషా పరిరక్షణకు, అందులోని రచనలను భావితరాలకు అందించేందుకు కృషి జరగాలని సూచించారు.  

మాజీ  ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో రచయితలకు కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతు న్నారని, తెలుగు వారు విడిపోతున్నారని అన్నారు. ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ కారా లాంటి కథకుడు లేరని, తన జీవిత సార్థకతకు కొన్ని నియమాలను ఆయన పెట్టుకున్నారని చెప్పారు. ఎవరూ చెప్పని గొప్ప విషయాలు సాహిత్యం చెప్పిందని భావించి సాహిత్యానికి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి కారా మాస్టారు అని కొనియాడారు. ప్రకృతి నియమాలు, సమాజ నియమాలు పాటించాలన్న నియమాన్ని ఆయన  జీవితాంతం ఉల్లంఘించలేదని తెలిపారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగ నాథం మాట్లాడుతూ సమాజంలోని సమస్యల మూలాలను తెలుసుకోగలిగితే మంచి కథలు రాసి సమస్యలకు పరిష్కారం అన్వేషించ గలమని కారా మాస్టారు చెబుతుండేవారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కథానిలయంను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి రచనలను ప్రపంచానికి పరిచయం చేయడమే కారా మాస్టారుకు మనం ఇచ్చే నివాళి  అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత చీకటి దివాకర్ మాట్లాడుతూ తెలుగు కథకుల్లో మూడు తరాలు వారికి ప్రతినిధిగా కారా మాస్టారు నిలిచారన్నారు. గోనె సంచులు పట్టుకుని ఊరురా తిరిగి కథలు సేకరించారని అన్నారు. విశ్వసాహితి అధ్యక్షులు పొన్నాడ వరాహ నరసింహులు, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షులు కె.శ్రీనివాస్, కారా మాస్టారి కుమారుడు కె.సుబ్బారావు, గరిమెళ విజ్ఞాన సమితి అధ్యక్షుడు వి.జి.కె.మూర్తి తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ప్రత్యేక సదస్సు జరిగింది.

కారా మాస్టారు రచనలు, కథలపై రచయితలు, ఉపాధ్యాయులు దుప్పల రవికుమార్, కంచె రాన భుజంగరావు, మల్లిపురం జగదీష్, డా. కె. ఉదయ్ కిరణ్, ఎ.మోహనరావు, బాడాన శ్యామలరావు, బాల సుధాకర మౌళి, చింతాడ తిరుమలరావు, పూజారి దివాకర్ పత్ర సమర్పణ చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, భాషాభిమా నులు, అనుచరులు, విద్యార్థులు పాల్గొన్నారు.