Leading News Portal in Telugu

Devendra Fadnavis says ‘no musical chair’ for chief minister post in Mahayuti


  • ముఖ్యమంత్రి పదవిపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రి పదవికి మ్యూజికల్ చైర్ ఉండదని వ్యాఖ్య
Devendra Fadnavis: ముఖ్యమంత్రి పదవిపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు బరిలో నిలుచున్నదెవరో తేలిపోయింది. ఇక ప్రచార రంగంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి మ్యూజికల్ చైర్ ఉండదని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలే అధికార పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాయుతికి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. మహాయుతి మిత్రపక్షాలు తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తాయని దేవేంద్ర ఫడ్నవిస్ ఓ జాతీయ మీడియాతో అన్నారు.

‘‘ఏక్‌నాథ్ షిండేతో సహా మా కూటమిలోని ఏ నాయకుడూ ఈ పదవిని డిమాండ్ చేయలేదు. నిర్ణయం న్యాయంగా ఉంటుందని అందరూ విశ్వసిస్తున్నారు.’’ అని ఫడ్నవిస్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా మహారాష్ట్రలో అధికార కూటమికి అనుకూలమైన పవనాలు ఉన్నాయన్నారు.

మహా వికాస్ అఘాడిపై ఫడ్నవిస్ విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి కూటమి.. ప్రస్తుత ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు రెట్టింపు హామీ ఇస్తోందని, బడ్జెట్ కేటాయింపులపై గతంలో చేసిన విమర్శలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉందని ఫడ్నవిస్ చెప్పారు.

ఇది కూడా చదవండి: UP: రీల్స్ మోజులో కుమార్తెను నీటిలో వదిలేసిన తల్లి.. నీట మునిగి చిన్నారి మృతి(వీడియో)