Leading News Portal in Telugu

We Are Preparing A Master Plan For The Development Of Pithapuram: Pawan Kalyan


  • గొల్లప్రోలులో స్కూల్ విద్యార్థులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి..

  • గొల్లప్రోలు.. పిఠాపురం.. కొత్తపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం..

  • పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం- డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం..

Pawan Kalyan: కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులోని ఎమ్మార్వో ఆఫీసులో మిగిలిన పనులు, సుద్దగడ్డ బ్రిడ్జి నిర్మాణం, సూరంపేట గొల్లప్రోలు అప్రోచ్ రోడ్డు నిర్మాణం, ఎంపీపీ స్కూలు అదనపు గదులు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం కంటే దేశం కోసం పనిచేయాలని సూచనలు చేశారు. నేను నా కోసం రాలేదు మీకోసం వచ్చాను అని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్ లేదని డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి విద్యార్థులు తీసుకోచ్చారు. త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. విజువల్ థింకింగ్ మీద పిల్లలకి పాఠాలు చెప్పాలని టీచర్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. అలాగే, గొల్లప్రోలులో వికలాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలను అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించి.. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత మీది అని తెలిపారు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను.. పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను.. అలాగే, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (PADA)ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, వరదల సమయంలో బయటకు రాను అన్నారు.. వస్తే కాదు కదా సమస్యలు అడ్రెస్ చేయాలన్నారు. బుగ్గలు నిమరడం, కన్నీళ్లు తుడవడం కాదు.. కన్నీరు రాకుండా చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. ఉన్న డబ్బులను గత ప్రభుత్వం దోచేసింది.. ఋషి కొండ పేరు చెప్పి దోచేశారు.. పనులు పూర్తి చేసి మీతో చప్పట్లు కొట్టించుకుంటాను అని తేల్చి చెప్పారు. చాలా కమిట్మెంట్ తో పని చేస్తాను.. మీరు పనులు చెప్పండి నేను పూర్తి చేస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

అలాగే, ఇసుక విషయంలో ఇబ్బంది పెడితే మీరు బలంగా ఎదురు తిరగండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇసుకకి సంబంధించి సమస్య ఉంది.. ఇసుక డబ్బు సంపాదనకి మార్గం అయిపోయింది.. ఎవరు జోక్యం చేసుకోవద్దని సీఎం చాలా స్పష్టంగా చెప్పారు.. ఎమ్మెల్యే లకి ఈ విషయం చెప్పారు.. ఇసుక మీ హక్కు, తప్పులను ఉపేక్షించం అని తేల్చి చెప్పారు. అవసరం అయితే అధికారులని సస్పెండ్ చేయమని సీఎం చెప్పారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.