- ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో మొబైల్ మార్కెట్‌లో నథింగ్ సంచలనం
- మరో ప్రయోగానికి సిద్ధమైన నథింగ్
- ఎంత వరకు సక్సెస్ అవుతుందో

‘నథింగ్’ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో మొబైల్ మార్కెట్‌లో సంచలనం రేపింది. స్మార్ట్‌ఫోన్ అంటే ఇలానే ఉండాలనే కట్టుబాట్లకు తన ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో నథింగ్ చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు మరో నథింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ సమయంలో సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పై వెల్లడించారు.
ఓ సదస్సులో కార్ల్ పై మాట్లాడుతూ… ‘కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నాం. తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా జోడిస్తాం. సొంత ఓఎస్ ద్వారా మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సాధ్యపడుతుంది. నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ దీనిపై పనిచేయగలదు’ అని తెలిపారు.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌దే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేస్తుంటాయి. యాపిల్ మాత్రం సొంతగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించుకుంది. హువావే కంపెనీ హర్మనీ ఓఎస్‌ను తయారు చేసింది. ఇప్పుడు నథింగ్ సొంతగా ఐఓఎస్‌ను రూపొందించాలను చూస్తోంది. చూడాలి నథింగ్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.