Leading News Portal in Telugu

Rahul Gandhi to take part in caste census event in Hyderabad


  • నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ..

  • బోయిన్‌పల్లిలో కులగణనపై సమీక్షించనున్న రాహుల్..
Rahul Gandhi: నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ.. కులగణనపై చర్చ

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్​లో నిర్వహిస్తున్న మీటింగ్​లో రాహుల్ పాల్గొననున్నారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 5 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 5.20 గంటలకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు వెళ్లనున్నారు. సాయంత్రం 5. 30 గంటలకు కుల గణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సరిగ్గా గంట పాటు కొనసాగనున్న ఈ మీటింగ్ తర్వాత ఆయన తిరిగి 7. 10 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోని తిరిగి ఢిల్లీకి రాహుల్ గాంధీ పయనం కానున్నారు.

అయితే, రాహుల్ గాంధీ పాల్గొననున్న ఈ మీటింగ్ కు మీడియాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన లైవ్ సిగ్నల్స్ యొక్క లింక్ ను తెలంగాణ కాంగ్రెస్ తరఫున మీడియాకు అందుబాటులో ఉంచుతామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. మరో 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు పాల్గొనే అవకాశం ఉంది.