Leading News Portal in Telugu

Israel Pm Benjamin Netanyahu Fires Defence Minister Yoav Gallant


  • గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని నెతన్యాహు సంచలన నిర్ణయం..

  • ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గాలంట్‌ను పదవి నుంచి తొలగించిన బెంజిమెన్ నెతన్యాహు..
Israel PM: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన నిర్ణయం..

Israel PM: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి.. ఈ కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు జరుగుతున్నప్పుడు నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం ఉండాలి.. మొదట్లో అలాంటి నమ్మకమే మా మధ్య ఉండేది. దాని ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది కొనసాగడం లేదు.. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగిపోయాయి.. మా మధ్య విశ్వాసం సన్నగిల్లిందని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పుకొచ్చారు.

అలాగే, ఇదే సమయంలో గాలంట్‌ స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నియమించబోతున్నారు. విదేశాంగశాఖ బాధ్యతలను గిడియాన్‌ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఇక, గాలంట్‌పై నెతన్యాహు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు ట్రై చేయగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశ పెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్‌ గాలంట్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి ఇద్దరి మధ్య వైరం మొదలైనట్టు తెలుస్తుంది.