Leading News Portal in Telugu

Republicans Win Control of US Senate


  • సెనెట్‌పై పట్టు బిగించిన రిపబ్లికన్‌ పార్టీ..

  • సెనెట్‌లో రిపబ్లికన్లు 51 మంది ఉండగా.. డెమోక్రట్లకు 42 మంది..

  • ప్రస్తుతం 247 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో ట్రంప్.. 214 ఎలక్టోరల్ ఓట్లతో హరీస్
US Election: రిపబ్లికన్ల చేతికి అమెరికా సెనెట్‌..!

US Election: అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించేసింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. మరోవైపు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ట్రంప్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా ఇప్పుడు చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 8 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.

కాగా, ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు దొరికినట్లైతుంది. రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు రిటైర్‌ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపుతాయి. ఇక, 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు సాధించగా.. గతంతో పోలిస్తే ఒక స్థానం ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాల్లో విజయం సాధించగా.. దీంతో ఈసారి ట్రంప్‌ పార్టీ గెలిస్తే.. ఆయనకు కాంగ్రెస్‌ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాని పరిస్థితి రావొచ్చు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌ 247 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే, కమలా హరీస్ సైతం 214 ఎలక్టోరల్ ఓట్లతో గట్టి పోటీ ఇస్తుంది.