Leading News Portal in Telugu

Bhakti TV Koti Deepotsavam 2024 From November 9th to 25th, the Glow of a Millions of Lamps


  • నవంబర్‌ 9 నుంచి 25 వరకు భక్తి టీవీ కోటి దీపోత్సవం
  • హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవ మహాయజ్ఞం
Koti Deepotsavam 2024: కోటి దీపాల పండుగ.. కోటి దీపోత్సవం ఈ నెల 9 నుంచి 25 వరకు..

Koti Deepotsavam 2024:

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే

దీపమనగానే గుర్తుకువచ్చే శ్లోకమిది. ప్రమిదలో వెలిగే పరంజ్యోతే పరబ్రహ్మస్వరూపమని శ్లోకార్థం. భగవంతుడిని సాకార నిరాకార రూపాల్లో దర్శించగలిగే ఏకైక సాధనం దీపం. దీపం అంటే ప్రమిదలో నూనె పోసి.. వత్తి వేసి.. అగ్ని వెలిగించడం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం.

దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదాన్ని చూపేందుకు ప్రతిరోజూ దీపం వెలిగించమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తికమాసంలో దీపం వెలిగించడానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. అటువంటి పుణ్యఫలితం ప్రతి ఒక్కరికీ దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తిటీవీ-ఎన్టీవీ కోటిదీపోత్సవం.

కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కోటిదీపోత్సవ మహా యజ్ఞాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ-ఎన్టీవీలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.

లక్ష దీపాలతో ప్రారంభించిన ఈ దీప యజ్ఞాన్ని ఆ తర్వాత కోటి దీపోత్సవంగా విస్తరించింది ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం.. దేదీప్యమానంగా వెలిగే దీపపు కాంతులు, ప్రచానామృతాలు, కల్యాణ కమనీయాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే కోటి దీపోత్సవం ఈ నెల నవంబర్‌ 9వ తేదీన ప్రారంభం కానుంది.. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాగే ఈ దీపయజ్ఞం నవంబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది.. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు ఈ పవిత్ర దీపోత్సవం సాగుతోంది.. ఇక, వేలాది మంది భక్తులతో కోటిదీపోత్సవ ప్రాంగణం వెలిగిపోతుంది.. ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కళ్యాణాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోన్న ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తమ సందేశాలు ఇస్తారు.

2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు. నవంబర్ 9 నుంచి ఆరంభంకాబోతోన్న దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది ఎన్టీవీ – భక్తి టీవీ.