Leading News Portal in Telugu

CM Revanth Reddy to Visit Musi Tomorrow


  • మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

  • రేపు ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు

  • 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం.. పూజ

  • 1.30 కి రోడ్డు మార్గంలో సంగెం

  • సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్పం

  • సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభం.


CM Revanth: రేపు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొననున్న సీఎం..

మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు. సీఎంకు సంబంధించిన యాత్ర షెడ్యూల్…..

రేపు ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం 11.30కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టనున్నారు. 1.30కి రోడ్డు మార్గంలో సంగెం వెళ్లి.. అక్కడి నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర చేపట్టనున్నారు.

మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం కానున్నారు.