Leading News Portal in Telugu

Israeli airstrikes target Beirut’s southern suburbs near airport


  • మరోసారి బీరుట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

  • హెజ్‌బొల్లా ముష్కరులు ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేశాం: ఇజ్రాయెల్
Israeli Airstrikes Beirut: బీరుట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..

Israeli Airstrikes Beirut: లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది. హెజ్‌బొల్లా ముష్కరులు ఆయా ప్రాంతాల్లో నక్కి ఉన్నారంటూ తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్‌ సైన్యం చెప్పుకొచ్చింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే దాడులకు దిగినట్లు పేర్కొనింది. అయితే, ఈ దాడుల నష్ట తీవ్రత ఇంకా వెల్లడించలేదు. మరోవైపు- ఇజ్రాయెల్‌ దూకుడును తగ్గించుకుంటే.. కాల్పుల విరమణపై ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము రెడీగా ఉన్నట్లు హెజ్‌బొల్లా నేత నయీం ఖాసిం బుధవారం చెప్పుకొచ్చారు.

ఇక, గాజాలో తమ సైనిక ఆపరేషన్‌ను మరింత విస్తృతం చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా వాయవ్య గాజా పట్టణమైన బీట్‌ లహియాలో భూతల దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యుద్ధం స్టార్టింగ్ లోనే బాంబు దాడులతో ఈ పట్టణంలో ఇజ్రాయెల్‌ నానా బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం హమాస్‌ ముష్కరులు మళ్లీ అక్కడ తలదాచుకుంటున్నట్లు సమాచారం అందింది.. అందుకే భూతల దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.

కాగా, అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్‌ నుంచి 25 ఎఫ్‌-15 యుద్ధ విమానాలను కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఇజ్రాయెల్‌ తెలిపింది. దాడులకు పాల్పడే పాలస్తీనా ప్రజల కుటుంబ సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించేలా కొత్త చట్టాన్ని గురువారం నాడు ఇజ్రాయెల్‌ తీసుకొచ్చింది. సంబంధిత బిల్లును ఆ దేశ పార్లమెంటులో 61-41 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇజ్రాయెల్‌తో పాటు తూర్పు జెరూసలెంలోని పాలస్తీనా పౌరులకు ఈ చట్టం వర్తించనుంది. బహిష్కరణ వేటు పడ్డవారిని గాజా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టనున్నారు.