A massive rally of labor unions to the main post office on 10th of this month against the privatization of Visakhapatnam steel
- విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన..
-
1300 రోజులు దాటిన కార్మిక సంఘాలు ఉద్యమం.. -
మరో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైన కార్మికులు..

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం 1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయివేటీకరణ జరగబోదని పీలర్స్ ఇస్తూనే తెరచాటు వ్యవహారాలను చక చక పూర్తి చేసేస్తోంది. 2000 మందికి టిఆర్ఎస్ అమలు చేయాలని ఆలోచన., సీనియర్ ఉద్యోగులను నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులో జాప్యం వంటి వ్యవహారాలతో ఆందోళన రెట్టింపు అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రజాభీష్టాన్ని దేశ ప్రధానికి మరింత బలంగా చేరవేసేందుకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఆర్కే బీచ్ లో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తోంది. ‘రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ విత్ డ్రా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్’- అనే నినాదంతో 10 లక్షల పోస్ట్ కార్డులు పంపిస్తామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోనే ఒక సమస్యపై ప్రధానికి 10 లక్షల పోస్ట్ కార్డులు పంపడం రికార్డుగా చరిత్రలో మిగులుతుందంటున్నారు. మొదట విడతగా రెండున్నర లక్షల పోస్ట్ కార్డులను ఇప్పటికే సిద్ధం చేసింది ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ. ఈ నెల 10న భారీ ర్యాలీగా ప్రధాన పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ కార్డులను పోస్ట్ చేసేలా కార్యచరణ రూపొందించింది.