వైసీపీ సోషల్ మీడియా దాటేసింది హద్దులు.. చంద్రబాబు వార్నింగ్ తో మొదలైన వణుకు! | cbn angry on inappropriate posts| strong| warning| fear| shiver| ycp| social| media
posted on Nov 8, 2024 9:40AM
ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన వారిపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పాల్పడింది. తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలు వైసీపీ సోషల్ మీడియా వెకిలి పోస్టులతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కట్టడి చేయాల్సిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ మేరకు చర్యలు తీసుకోకపోగా.. అలాంటి వారికి పార్టీలో పెద్దపీట వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు సతీమణితోపాటు పవన్ కల్యాణ్ సతీమణి, నారా లోకేశ్ సతీమణి ఇలా అనేక మంది విపక్షాల నేతల కుటుంబ సభ్యులు, మహిళా నేతల పై అసభ్యకర పోస్టింగ్ లతో వైసీపీ సోషల్ మీడియా మూక రెచ్చిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ సోషల్ మీడియా వెకిలి పోస్టులకు చెక్ పడుతుందని అందరూ భావించారు. కానీ, వారి ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా సైకోలను జగన్ ఇంకా ప్రోత్సహిస్తూ వచ్చారు. హోం మంత్రి అనిత, జగన్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పెట్టిన అసభ్యకర పోస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా వైసీపీ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ విష ప్రచారం చేయడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి తెలుగుదేశం, జనసేన నేతలపై అసభ్య పదజాలంతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పిఠాపురం పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత రివ్యూ చేయాలని.. పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టాలని సూచించారు. అదేక్రమంలో నేను హోం మంత్రి పదవి తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ.. ఇప్పటికీ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులకు పవన్ హెచ్చరికలు జారీ చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడారు. అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు తో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తరువాత హోంమంత్రి అనిత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ మధ్య ప్రధానంగా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయే వారిపై, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టులుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అమరావతిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హద్దులుదాటి ప్రవర్తిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై తప్పుడు పోస్టింగ్ లు పెట్టాలంటే వణికిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తామని, నెలరోజుల్లో పోలీస్ వ్యవస్థను సెట్‌రైట్ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ వరుస వార్నింగ్ లతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌లో వణుకు మొదలైంది. చంద్రబాబు వార్నింగ్ తరువాత.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఏకంగా డీజీపీ గారూ.. ప్రభుత్వాలు మారుతాయి.. కూటమి శాశ్వతం కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జగన్ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్పట్లో సీఎం హోదాలో వారిని కట్టడి చేయాల్సిన జగన్.. అలా చేయలేదు. కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారిని కట్టడి చేయాలని చూస్తుంటే జగన్ కంగారు పడిపోతుండటం గమనార్హం.
తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిళ కూడా స్పందించారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరిగా షర్మిళ చెప్పుకున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు చెప్పిన షర్మిల అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హద్దులు మీరే వారిపై కొరడా ఝుళిపించి, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటే.. జగన్ మాత్రం వ్యతిరేకిస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసులు చెబుతుంటే.. వారిని జగన్ బెదరించడం చూస్తుంటే.. అధికారం పోయినా కూడా జగన్ రెడ్డిలో మార్పు రాలేదని అవగతమౌతోంది. ఇప్పటికీ జగన్ తీరులో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో నుంచి సైతం వినిపిస్తోంది.