Leading News Portal in Telugu

Mohammad Nabi To ODI Retire after Champions Trophy 2025 in Pakistan


  • మహ్మద్ నబీ కీలక నిర్ణయం
  • వ‌న్డేల‌కు రిటైర్మెంట్
  • 165 వన్డేల్లో 3549 పరుగులు
Mohammad Nabi Retirement: రిటైర్మెంట్‌పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!

అఫ్గానిస్థాన్‌ స్టార్ ఆల్‌రౌండర్ మ‌హ్మ‌ద్ న‌బీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2025లో పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత వ‌న్డేల‌కు విడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ క్రిక్‌బజ్‌కి ధృవీకరించారు. నబీ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు.

‘మ‌హ్మ‌ద్ నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అతడు రిటైర్‌ అవుతాడు. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు దృష్టికి ఈ విషయాన్ని నబీ తీసుకొచ్చాడు. ఇదే విషయంను కొన్ని నెలల కిందటే నాకు చెప్పాడు. నబీ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. టీ20ల్లో మాత్రం నబీ కొనసాగుతాడని ఆశిస్తున్నాం’ అని నసీబ్ ఖాన్ క్రిక్‌బజ్‌తో అన్నాడు.

2009లో అఫ్గానిస్థాన్‌ తరఫున క్రికెట్‌ అరంగేట్రం చేసిన మ‌హ్మ‌ద్ నబీ.. 165 వన్డేల్లో 3549 పరుగులు, 171 వికెట్లు పడగొట్టాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ల‌పై అఫ్గాన్ చారిత్ర‌త్మ‌క విజ‌యాలు సాధించ‌డంలో న‌బీది కీల‌క పాత్ర‌. యువ ఆట‌గాళ్ల‌కు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్‌ 2026 వరకు కొనసాగే అవకాశముంది.