ఓటమి భయంతో పోటీ నుంచి వైసీపీ పలాయనం | ycp ranaway from graduate mlc elections| ballot| jagay| shows| back| allege| cbn
posted on Nov 8, 2024 10:23AM
జగన్ మోహన్ రెడ్డి మాటలకూ చేతలకూ పొంతనే ఉండదు. అవసరానికి తగినట్టుగా ఏదో ఒకటి మాట్లాడేసి తీరా సమయం వచ్చే సరికి మాట మారుస్తారు. మాటతప్పను.. మడమ తిప్పను అంటూనే ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ ఆయన అదే చేశారు. ఇటీవలి ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి బ్యాలెట్ బాక్సులే కారణమని, వాటిని ట్యాంపర్ చేసి తెలుగుదేశం కూటమి విజయం సాధించిందనీ ఊరూ వాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న జగన్, అదే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే మా సత్తా తెలిసేది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తీరా ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికలు వచ్చే సరికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది.. అందుకే ఎన్నికలకు దూరం అంటే మాట తప్పి మడమ తిప్పేశారు. జగన్ తీరు చూస్తుంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా అన్న వేమన పద్యం గుర్తుకు రాకమానదు. ఎందుకంటే.. రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనూ జరుగుతాయి. దీంతో ఎన్నికలలో వైసీపీ సత్తా చాటేందుకు వైసీపీకి ఓ చక్కటి అవకాశం దొరికింది.
బ్యాలెట్ ఎన్నికలైతే మా సత్తా చూపేవాళ్లం అంటూ డప్పాలు కొట్టిన జగన్ ఇప్పుడు ఆ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక పోటీ నుంచే వైదొలిగారు. అసలు ఎన్నికల ప్రకటన వెలువడగానే వైసీపీ ఆర్భాటంగా ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రెడ్డి పేరును ఊరుకు ముందే ప్రకటించేసింది. ఇక నేడో రేపో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరు ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇక్కేడ జగన్ రెడ్డి మడమ తిప్పేసి ముఖం చాటేశారు. ఎన్నికల నుంచి పార్టీ తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయించారు. స్వయంగా ప్రకటించేందుకు ముఖం చెల్లక మాజీ మంత్రి పేర్ని చేత గ్యాడ్యుయేట్ ఎన్నికల బరిలో వైసీపీ నిలబడటం లేదని తేల్చేశారు. ఇక్కడా పాత కథే చెప్పారు. జగన్ తీరు ఎలా ఉంటుందంటే తప్పులు తాను చేసి ప్రత్యర్థులపై నిందలు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్ని నాని చేత చేయించిన ప్రకటనలోనూ అలాగే చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందనీ, ఈ ఎన్నికలు ధర్మబద్దంగా జరుగుతాయనే నమ్మకం లేకనే బహిష్కరిస్తున్నామని, అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నామనీ పేర్ని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. వాస్తవానికి గత ఎన్నికలలో ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలలో వైసీపీ స్వీపౌట్ అయిపోయింది. అక్కడ గ్యాడ్యుయేట్ ఎన్నికలలో పరాభవం తప్పదని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే పట్టభద్రులు వైసీపీని ఘోరంగా ఓడించారు. అయితే అప్పట్లో తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ అప్పటి పరాజయానికి సాకులు చెప్పుకున్న జగన్.. ఈ సారి ఏకంగా పార్టీని పోటీ నుంచే తప్పించి అధికార తెలుగుదేశం కూటమిపై అభాండాలు వేస్తున్నారు.
వాస్తవానికి జగన్ హయాంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు అందరికీ ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్పట్లో నామినేషన్ వేయడానికి వచ్చి తెలుగుదేశం అభ్యర్థులపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డాయి. నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశాయి. అలాంటి అరాచక పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం స్థానిక ఎన్నికలను బహిష్కరించలేదు. కానీ ఇప్పుడు జగన్ ఓటమి భయంతో బరిలోకి దిగకుండానే పలాయనం చిత్తగించారు.