Leading News Portal in Telugu

3rd Day IT Raids on Former MLA Grandhi Srinivas Residence and Office


  • మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు..

  • మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు..
IT Raids on Grandhi Srinivas: మూడో రోజు గ్రంధి శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ సోదాలు

IT Raids on Grandhi Srinivas: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల సోదాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి.. రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపార సంస్థల్లో, భాగస్వాముల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. మొదటిరోజు గ్రంధి శ్రీనివాస్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగించారు.. ఇక, తర్వాత రోజు ఆయన వ్యాపార సంస్థల్లో జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు..

అయితే, మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ అధికారులు రికార్డుల పరిశీలన అనంతరం ఏం తేల్చబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విజయం సాధించిన గ్రంధి శ్రీనివాస్‌.. తాజా ఎన్నికలకు ముందు నుంచి పవన్‌ కల్యాణ్‌కు సవాళ్లు విసురుతూ వచ్చారు.. అయితే, ఈ ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్‌ ఓటమిపాలయ్యారు.. ఇదే సమయంలో పిఠాపురం నుంచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు పవన్‌ కల్యాణ్.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడం.. ఆయన కీలకమైన శాఖలతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే..