Leading News Portal in Telugu

వైసీపీ ఖేల్ ఖ‌తం.. బెంగ‌ళూరులోనే ఇక జ‌గ‌న్‌ మకాం!? | jagan to quit andhra pradesh and shift bengaluru| ycp| scene| close| party


posted on Nov 9, 2024 10:17AM

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేతిలో  చావు దెబ్బ‌తిన్న వైసీపీ ఖేల్ ఇక ఖ‌తం కాబోతోందా?  ఏపీలో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త్వ‌ర‌లో త‌న దుకాణం మూసేయనున్నారా?  అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేగంగా వేస్తున్నది.  అయితే, అధికారం కోల్పోయినా వైసీపీ నేత‌ల్లో మార్పు రాలేదు. ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తుండ‌టంతో పాటు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నారు. మార్ఫింగ్ ఫొటోల‌ను పెడుతూ మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేస్తున్నారు.

తాజాగా ఈ విష‌యంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ తోనే చంద్ర‌బాబు స‌రిపెట్ట‌లేదు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ  సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో రెచ్చిపోయి వైసీపీ సోష‌ల మీడియా బ్యాచ్ వ‌ణికిపోతోంది. ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని దెబ్బ‌తిన్నామ‌ని, మాపై కేసులు పెట్టొద్ద‌ని వేడుకుంటున్నారు. మ‌రోవైపు వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వైసీపీ క్యాడ‌ర్ చెల్లాచెదురౌతోంది. ఓట‌మి భ‌యంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  పోటీకి జ‌గ‌న్ వెనుక‌డుగు వేశారు. మ‌రోవైపు అసెంబ్లీకి వ‌చ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తేందుకు కూడా జగన్ భయపడుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాను కానీ మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అయితే ఆయన ఇక రాష్ట్రంలో ఉండటం కంటే మకాం మార్చేయడమే సేఫ్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీలో వైసీపీ హ‌యాంలో అరాచ‌కాలు అన్నీఇన్నీ కావు. ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు అధికార పార్టీ నేత‌ల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు పెట్టి జైల్లో వేయ‌డం.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి మాన‌సికంగా వేధించ‌డం. ఇదేళ్ల జగన్ పాలన అంతా ఇదే తీరు.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌ల‌పై రెచ్చిపోయిన వారిని పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప‌ద‌వులు ఇస్తూ  ప్రోత్స‌హించ‌డంతో వారి ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి లేక‌పోవడం, అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు మితిమీరిపోవడంతో  ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వ‌కుండా మీ పార్టీ ఏపీలో అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి జనం విస్పష్టంగా చెప్పేశారు.

అయితే వైసీపీ ఘోర పరాజయం, తెలుగుదేశం కూట‌మి ఘన విజయం తరువాతైనా వైసీపీ నేత‌ల వేధింపులు, సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల గొడ‌వ త‌గ్గుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా వైసీపీ నేత‌ల్లో మార్పు క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌ను పోస్టులు చేస్తూ  ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఈ విషయాన్ని సీరియ‌స్ గా నిర్ణ‌యం తీసుకున్నారు. ఎ వ‌ర్నీ వ‌దిలిపెట్ట‌కుండా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, పెడుతున్న వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయిన వారినిపై కేసులు న‌మోదు చేసి అరెస్టులు చేస్తుండ‌టంతో వారు వ‌ణికిపోతున్నారు.

ఏపీలో ఉమ్మ‌డి తూర్పుగోదావరి – పశ్చిమ గోదావరి, ఉమ్మ‌డి కృష్ణా – గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్ల‌లో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌ట‌మేన‌ట‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపితే చిత్తుచిత్తుగా ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని వైసీపీ అధిష్టానానికి క్లారిటీ రావ‌డంతో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. అయితే జగన్ తాము పోటీ నుంచి త‌ప్పుకోవ‌టానికి అధికార పార్టీ నేత‌ల అరాచ‌కాలే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. వైసీపీ నేత‌లు మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం అరాచ‌క‌పాల‌న సాగిస్తోందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుండ‌టంతో ప్ర‌జ‌లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీకి వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన జ‌గ‌న్.. భ‌య‌ప‌డిముఖం చాటే స్తున్నారు. దీంతో  వైసీపీ నేతలలో సైతం జగన్ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంకా జ‌గ‌న్ వెంట ఉంటే  రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండదని పార్టీకి గుడ్ బై కోట్టేయాలని పలువురు నేతలు భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  

అధికారం కోల్పోయిన త‌రువాత అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతుండ‌టంతో పాటు త్వ‌ర‌లో త‌న‌ను కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌న్న భయంతో జగన్  తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేని బెంగళూరు చెక్కేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఎక్కువగా బెంగ‌ళూరులోనే  జగన్ ఉంటున్నారు. ఇప్పుడిక మొత్తంగా ఏపీని వదిలేసి బెంగళూరుకు మకాం మార్చేయాలని భావిస్తున్నారనీ, అక్కడ నుంచే రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని మానిట‌ర్ చేస్తారనీ  వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే బెంగళూరు మకాం మార్చేసిన తరువాత ఆయన పార్టీని పట్టించుకునే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ, పూర్తిగా తన సొంత బిజినెస్ ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయనీ ఆయనను దగ్గరగా తెలిసిన వారు చెబుతున్నారు. దీంతో ఇక ఏపీలో వైసీపీ సీన్ సితార అయిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.