Gundampally and Dilawarpur villages are far away from comprehensive family survey in Nirmal district.
- నిర్మల్ జిల్లాలో సర్వేకు దూరంగా రెండు గ్రామాలు
-
ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలంటూ.. -
సర్వేకు దూరంగా ఉన్న గుండంపల్లి.. దిల్ వార్ పూర్ గ్రామాల వాసులు -
గత కొంతకాలంగా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులు -
ఇప్పటికే సర్వేకు సహకరించబోమని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన స్థానికులు -
బహిష్కరించిన వారి పై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరిక.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు. కావున ఈ సర్వేలో ప్రజలందరూ స్వచ్చందంగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కొన్ని గ్రామాలలో సర్వేను బహిష్కరించడం సరికాదని.. జిల్లాలో వివిధ కారణాలతో సర్వేను బహిష్కరించిన, అడ్డుకునే ప్రయత్నం చేసిన సంబంధిత వారిపై చర్యలు కఠిన ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
సమగ్ర కుటుంబ సర్వే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని.. సర్వే పై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలందరూ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు. సర్వే నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి వివిధ వర్గాల వారు అభినందనలు తెలియజేస్తూ ఈ సర్వేను తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే హౌస్ లిస్టింగ్ పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. సర్వేపై ఎటువంటి సందేహాలున్నా క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దారులు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వేకు సహకరిస్తున్న ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎన్యుమరేటర్లకు, సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.