Leading News Portal in Telugu

Rare incident in Visakhapatnam KGH


  • విశాఖ కేజీహెచ్‌లో మిరాకిల్
  • చనిపోయిన శిశువులో చలనం
  • తండ్రి ఆనందానికి అవధుల్లేవ్
Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో మిరాకిల్.. చనిపోయిన శిశువులో చలనం! ఆనందంలో తండ్రి

విశాఖపట్నం కేజీహెచ్‌లో ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. చనిపోయిన శిశువులో కొన్ని గంటల తర్వాత చలనం వచ్చింది. వెంటనే పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ (నియోనెటాల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించిన డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దాంతో చనిపోయాడనుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ శిశువు తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వివరాల ప్రకారం… విశాఖపట్నం నగరానికి చెందిన ఓ గర్భిణీ పురుటి నొప్పులతో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో చేరారు. వైద్యులు సిజేరియన్‌ చేసి.. ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ.. బరువు తక్కువగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఎనిమిది గంటల పాటు శ్రమించారు. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో శిశువుకు ఊపిరి ఆడలేదు. వైద్యులు పరిశీలించి ప్రాణం పోయిందని చెప్పడంతో.. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి రికార్డ్స్ లో సిబ్బంది ఎంట్రీ చేశారు.

ఆస్పత్రి సిబ్బంది శిశువుని తండ్రికి అప్పగించారు. శిశువును ఇంటికి తరలించేందుకు తండ్రి అంబులెన్స్‌లోకి లెక్కిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో శిశువులో కదిలికలు రావడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించగా.. వెంటనే వారు స్పందించి పీడియాట్రిక్‌ విభాగంలోని ఎన్‌ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చనిపోయాడని భావించిన శిశువు బతికే ఉండటంతో ఆ తండ్రి ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.