Leading News Portal in Telugu

కేసీఆర్ ఇప్పుడైనా మాట నిల‌బెట్టుకుంటారా..? | will kcr keep his word atleast now| active| plitics| january| next


posted on Nov 11, 2024 3:27AM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆయ‌న ఇచ్చిన గ‌డువు పూర్త‌యిందా.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగ‌బోతున్నారా.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇటీవ‌ల కేసీఆర్‌ను క‌లిసి బీఆర్ఎస్ నేత‌ల‌కు ఆయ‌న ఇదే విష‌యాన్ని చెప్పారు‌.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌నం ఇచ్చిన గ‌డువు పూర్త‌యింది. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి  నుంచి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహం ఎలా ఉంటుందో మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌లు చూడ‌బోతున్నార‌ని కేసీఆర్ పేర్కొన్నారు‌. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతున్నది. అయితే, కొంద‌రు బీఆర్ఎస్‌ నేత‌లు మాత్రం కేసీఆర్ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటినుంచి ఫాం హౌస్‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్‌.. ప‌లు సంద‌ర్భాల్లో ఇక‌ నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతాన‌ని పలుమార్లు చెప్పారు. కానీ, క‌నీసం పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌లేదు. కేటీఆర్ ఆధ్వ‌ర్యంలోనే పార్టీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు, త‌న‌ను న‌మ్ముకున్న వారిపై కేసులు న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ కేసీఆర్ మౌనం వీడ‌కపోవ‌టం ప‌ట్ల కొంద‌రు కార్య‌క‌ర్త‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వ‌చ్చే ఏడాది జ‌నవ‌రి నుంచైనా కేసీఆర్ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారన్న న‌మ్మ‌కం  లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు బాహాటంగానే తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యారు. ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విమ‌ర్శ‌ల దాడి చేసినా కేసీఆర్ ఏమ‌త్రం స్పందించ‌లేదు.   బీఆర్ఎస్ పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌లేదు.   ప్ర‌తిప‌క్ష నేత హోదాలో అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతార‌ని భావించిన‌ప్ప‌టికీ హాజ‌రు కాలేదు. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టిన రోజు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చిన కేసీఆర్‌.. ఇక నుంచి నేనేంటో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చూపిస్తానంటూ హెచ్చరించారు.  అప్ప‌ట్లో బీఆర్ఎస్ నేత‌లు తెగ సంబరాలు చేసుకున్నారు.  బాస్ రీఎంట్రీ  అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు అధికార పార్టీపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో వారిపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. కానీ  కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. దీంతో కొందరు బీఆర్ఎస్ నేతలు అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్  బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. అసెంబ్లీలోనూ, బయట అన్నీతానై పార్టీని ముందుండి  నడిపిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రేవంత్ వ్యూహంలో కేటీఆర్ తేలిగ్గా చిక్కుకుంటున్నారని, తద్వారా ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీయాల్సిందిపోయి ఇతర అంశాలపై కేటీఆర్ ఫోకస్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ రావు అప్పుడప్పుడూ మీడియా ముందుకొచ్చినా.. గతంలోలా పార్టీ తరపున తన వాయిస్   వినిపించడం లేదన్న వాదన ఉంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంట్రీ ఇస్తేనే అధికార పార్టీకి దీటుగా సమాధానం చెప్పొచ్చునని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఇక నేను వస్తున్నా.. అధికార పార్టీ భరతం పడతా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆయన ఇప్పటికీ బయటకు వచ్చి అధికార పార్టీ దూకుడును అడ్డుకోవడానిక ప్రయత్నించిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. 

అయితే, తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు   ఫామ్ హౌస్ లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ను ఉద్దేశించి  ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి కానీ రౌడీ పంచాయితీ చేయడానికి కాదంటూ ఘాటుగా విమర్శించారు. ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా? అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో బీఆర్ఎస్  అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసింది,  ప్రస్తుతం 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయాం అనే విషయాన్ని ప్రజలకు అర్ధమైందని,   రాబోయే రోజుల్లో కచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్  అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా  వ్యక్తం చేశారు. అధికార పార్టీకి మనం ఇచ్చిన గడువు అయిపోయింది.. ఇకనుంచి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు, ఇక నుంచి తాను పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతానని కేసీఆర్ చెప్పారు.   కేసీఆర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులలో ఆనందం వ్యక్తం అవుతుంటే.. పలువురు బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ ఇప్పటి వరకూ చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్లుగా వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ.. ఈ సారైనా మాట మీద నిలబడతారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.