posted on Nov 11, 2024 4:34AM
తెలుగువారిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి పరారయ్యారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలోఇటీవల నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న నటి కస్తూరి ఆ సందర్భంగా తెలుగువారిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీంతో ఆమెపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలు తెలుగు సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగాయి. పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలోనే
చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు నటి కస్తూరిపై కేసు నమోదు చేశారు. ఆమెకు సమన్లు అందజేయడానికి పొయెస్ గార్డెన్స్ లోని ఆమె నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆమె ఇంటికి తాళం వేసి ఉండటం కనిపించింది.దీంతో ఆమె సెల్ ఫోన్ కు ఫోన్ చేశారు. అయితే అది స్విచ్ఛాఫ్ లో ఉంది. దీంతో నటి కస్తూరి పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెను పట్టు కోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.