Leading News Portal in Telugu

Minister Atchannaidu Presented AP Agriculture Budget 2024


AP Budget 2024: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్!

ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని మంత్రి పేర్కొన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

‘ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక. రైతు అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. రైతులకు పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా చేస్తాం. భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్‌తో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రైతులకు పంట బీమా అందించలేదు. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించాం’ అని మంత్రి అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో తెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు ఇలా:
# వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
# భూసార పరీక్ష – రూ.38.88 కోట్లు
# రాయితీ విత్తనాలు – రూ.240 కోట్లు
# విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
# ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
# పొలం పిలుస్తోంది కార్యక్రమం – రూ.11.31 కోట్లు
# పంటల బీమా – రూ.1,023 కోట్లు
# ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
# డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
# వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
# ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు
# వడ్డీ లేని రుణాలు – రూ.628 కోట్లు
# అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
# రైతు సేవా కేంద్రాలు – రూ.26.92 కోట్లు