Leading News Portal in Telugu

పిల్ల సజ్జలకు ఇక మూడినట్లేనా? | pulivendula police refester case on sajjaja bhargav reddy| ycp| social| media| wing| former


posted on Nov 11, 2024 1:34PM

పెరుగుట విరుగుట కొరకే… అన్న సామెత అతికినట్లుగా పిల్ల సజ్జల అదేనండీ సజ్జల భార్గవరెడ్డికి అతికినట్లుగా సరిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన  ముఖంలా, గొంతులా వ్యవహరించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జల డిఫాక్టో సీఎంగా పెత్తనం చెలాయించారు.  ఆ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించుకునే సజ్జల  వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదేనండి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు.  దీంతో సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయారు.

 తెలుగుదేశం పార్టీ,   ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయింది. ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమిలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా ఉందనడంలో సందేహం లేదు.  సరే అది పక్కన పెడితే.. ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చిన తరువాత.. వైసీపీ చరిత్ర ఎరుగనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పరాభవం పాలైన తరువాత  పిల్ల సజ్జల అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి  వరకూ వైసీపీ సోషల్ మీడియా వింగ్  అధిపతిగా అసభ్య, అశ్లీల పోస్టులతో చెలరేగిపోయిన సజ్జల భార్గవరెడ్డి కిలికానిక్కూడా కనిపించకుండా మాయమయ్యారు. తండ్రి సజ్జల తన పుత్రరత్నాన్ని కేసుల నుంచి, సొంత పార్టీ నేతల దూషణల నుంచీ కాపాడుకోవడానికి చాలా తెలివిగా రాష్ట్రం నుంచి తరలించేశారు. చడీ చప్పుడు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ పోస్టు నుంచీ తొలగించేశారు.  

ఇన్ని జాగ్రత్తలు  తీసుకున్నా చేసిన పాపం మెడకు చుట్టుకోకుండా ఉండదు కదా? ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందులలో కేసు నమోదైంది.  ఇక ఇప్పుడు పిల్ల సజ్జల ఏ కలుగులో దాక్కున్నా పోలీసులు లాక్కు వచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాపం సజ్జల తన కుమారుడిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఇప్పటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడిపై కేసు నమోదు కావడంపై స్పందించ లేదు.