Leading News Portal in Telugu

Minister Kolusu Parthasarathy about AP Budget 2024-25


  • మరో రెండు పథకాల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం..

  • ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టాం..

  • గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న పార్థసారథి..
Minister Kolusu Parthasarathy: మరో రెండు పథకాల అమలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు..

Minister Kolusu Parthasarathy: మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసింది.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కారు చిన్నాభిన్నం చేసింది.. గత వైసీపీ సర్కారు 1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయింది అని ఫైర్‌ అయ్యారు.. అయితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృష్టి చేస్తోందన్నారు.. సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్న ఆయన.. పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచాం.. ఉచిత గ్యాస్ హామీ అమలులో భాగంగా 840 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం.. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వివరించారు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.

కాగా, ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే.. రూ. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభ ముందు ఉంచారు.. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లుగా ఉండగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లుగా పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌..