అసెంబ్లీ బహిష్కరణ.. జగన్ సెల్ఫ్ గోల్! | jagan self goal with assembly boycott decession| party| mlas| differ| cadre| angry| pride
posted on Nov 12, 2024 1:39PM
ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్ కాట్ చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా సెల్ఫ్ గోల్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ చేసిన తప్పులను తెలుగుదేశం కూటమి సభ్యులు అసెంబ్లీలో ఎండగడతారన్న భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం వైసీపీ భవిష్యత్ ను అంధకారం చేయడం ఖాయమని అంటున్నారు. బడ్జెట్ ప్రసంగాల ద్వారా అధికార పార్టీ తప్పులు, బడ్జెట్ లో జరగని కేటాయింపుల పై నిలదీతకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జారవిడుచుకుందని అంటున్నారు.
ప్రతిపక్ష హోదా ఇస్తామని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ,తమకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలనీ, ఆ విషయాన్ని స్పీకర్ చేత చెప్పించాలని వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తరువాత అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విపక్ష హోదా గురించి చేసిన ప్రసంగాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష హోదా అడిగేందుకు తనకు ఏ మాత్రం అర్హత లేదన్న విషయం జగన్ కు అర్ధమౌతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అసలు 11మంది సభ్యులున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిబంధన ఎక్కడుందో చూపాలని జగన్ నిలదీయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
అదీ కాక శాసన సభకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు శాసనమండలికి హాజరవడం ఆ పార్టీ ఒక పద్ధతీ పాడూ లేని విధంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అసెంబ్లీ అంటేనే శాసనసభ, శాసనమండలి కదా.. బడ్జెట్ సమావేశాలకు శాసన సభను బహిష్కరించి మండలికి హాజరవడం వైసీపీ రాజకీయ అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనంగా తెలుగుదేశం కూటమి అభివర్ణిస్తోంది.
శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామనడం ప్రజాస్వామ్య వ్యవస్థ లో తప్పు అవుతుంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరి ఇలానే కొనసాగితే తమపై అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ,అధికారం కోల్పోయినప్పుడు జగన్ ఒంటెద్దు పోకడలో మార్పు లేదని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అసెంబ్లీకి ముఖం చాటేసి రేపు ప్రజలు ముందుకు ఏ ముఖం పెట్టుకువెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం 10 శాతం సభ్యులున్న పార్టీలకే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది పట్టించుకోకుండా విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ బహిష్కరణ అని భీష్మించడం వల్ల అభాసుపాలు కావడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని బడ్జెట్ సమావేశాలకు హాజరై గౌరవాన్ని కాపాడుకుంటే పార్టీకీ, ఆయనకూ కూడా మంచిదని హితవు చెబుతున్నారు.