- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం..
- 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం..
- మంగళవారంతో 1000వ రోజుకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..
Russia-Ukraine War: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్ధం రష్యా-ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం నేటి ( మంగళవారం)తో 1000వ రోజుకు చేరుకుంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు చేపట్టిన దాడులతో కీవ్‌లో వినాశనానికి దారి తీసింది. పరస్పర క్షిపణి దాడులతో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది గాయాల బారిన పడ్డారు. ఉక్రెయిన్‌లో అనేక నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు కనుమరుగైపోయాయి. రెండున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ పోరు తీవ్ర విషాదం మిగిల్చింది.
ఇక, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 80 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో మరణించగా.. మరో 4 లక్షల మందికి పైగా గాయపడ్డారు. అలాగే, రష్యాలో బలగాల పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అయితే, పశ్చిమ దేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మంది మాస్కో సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు వదిలినట్లు సమాచారం. మరో 4లక్షల మంది వరకు సైన్యం గాయపడినట్లు టాక్. కానీ, ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల మిషన్ తెలిపిన గణాంకాల ప్రకారం.. ఆగస్టు 31, 2024 నాటికి కీవ్ వైపు కనీసం 11, 743 మంది సామాన్య పౌరులు యుద్ధం వల్ల మరణించారని పేర్కొనింది. మరో 24,600 మంది గాయపడినట్లు తెలిపింది.
ఇక, ఈ ఏడాది నవంబరు 14 నాటికి 589 మంది ఉక్రెయిన్ చిన్నారులు చనిపోయారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో జననాల రేటు పూర్తిగా తగ్గిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు పైగా పడిపోయింది. ఇక, దాదాపు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోనే మరో ప్రాంతానికి వలస వెళ్లారు. అలాగే, 60 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణ భయంతో దేశాన్ని వదిలి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారని సమాచారం. ఈ సుదీర్ఘ యుద్ధం కారణంగా గతేడాది డిసెంబరు నాటికి ఉక్రెయిన్ 152 బిలియన్ డాలర్ల నష్టపోయింది. దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్, ఐరాస అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే, ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం దాదాపు 486 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కీవ్ సాధారణ జీడీపీతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. రక్షణ రంగం కోసం దాదాపు 53.3 బిలియన్ డాలర్లను వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కీవ్ 100 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.