Leading News Portal in Telugu

అలిపిరిలో ముంతాజ్ హోటల్ కు స్థలం.. జగన్ అరాచకానికి మరో నిదర్శనం! | another winteness to jagan anarchy towards tirumal| government| alloted| muntazhotel| minimum| lease


posted on Nov 20, 2024 1:13PM

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు.  ఇది అందరికీ తెలిసిన వాస్తవమే.  అందుకే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు ఆయన హిందూ ధర్మ వ్యతిరేకా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. అయితే హిందూ ధార్మిక సంస్థలు, స్వామీజీలు మాత్రం ఆయన తిరుమల పవిత్రతను దెబ్బతీసిన ఉదంతాలు ఎత్తి చూపి జగన్ హిందూ వ్యతిరేకి అని ఎటువంటి సందేహాలు లేకుండా ఆరోపణలు చేశారు.  

అప్పట్లో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  జగన్ ను తన ప్రియశిష్యుడిగా పేర్కొన్న శారదాపీఠం అధిపతి స్వరూపానంద సర్వస్వతి కూడా ఒక సమయంలో జగన్ హిందూ ధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టే జగన్ హయాంలో ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి హయాంలో  హిందువుల మనోభావాలను పనిగట్టుకుని దెబ్బ తీసేవారనడానికి బోలెడు ఉదాహరణకు కనిపిస్తాయి.  ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో లేక్కలేదు. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం జరిగింది. టీటీడీలో అన్యమతస్తులకు కొలువులు ఇచ్చేశారు.

వైఖానస ఆగమ శాస్త్రం, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి జగన్ హయాంలో టీటీడీ  ఇష్టారాజ్యంగా తీసుకున్న పలు నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేశాయి. ఏడుకొందలపై   డ్రోన్లు సంచరించడం మొదలు,   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పించడం వరకూ జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అరాచకాలకు లెక్కే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ జగన్ హయాంలో ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు  భక్తులు, హిందూ ధర్మ సంస్థల నుంచి వెల్లువెత్తాయి.  ఎన్నో మార్లు ఆరోపించాయి. ఆగ్రహం వ్యక్తం చేశాయి.  జగన్ హయాంలో తిరుమలను  టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందని భక్తులు పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేశారు.    

తిరుమల లడ్డూ ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  జగన్ హయాంలో టీటీడీ తీరు ఉండేది.   అయితే భక్తులకు   సదుపాయాల విషయాన్ని   అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విస్మరించింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు   సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణను నిలిపేసింది.  క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది.   అంతేనా నిత్యం గోవిందనామస్మరణ తప్ప మరో పేరు వినిపించడమే మహాపరాథంగా భక్తులు భావించే తిరుమల కొండపై ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇంతగా తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన జగన్.. కొండ కింద కూడా తన హిందూ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటుకున్నారని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.    

2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి మార్గంలో ఆధ్యాత్మిక‌, సంస్కృతిక‌ కార్యక్రమాలకు వేదికగా దేవలోకం ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. 38 ఎకరాలలో 750 కోట్ల‌ రూపాయలతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పుడే పాతిక ఎకరాలు కేటాయించారు. ఆ తరువాత 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మూతపడింది. అడుగు ముందుకు పడలేదు. కానీ ఇదు కోసం కేటాయించిన పాతిక ఎకరాలలో ఓ ఇరవై ఎకరాలను జగన్ ముంతాజ్ హోటల్స్ కు స్టార్ హోటల్ నిర్మించడానికి  నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు.  

90 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల రూపాయల లీజుకు జగన్ ఈ స్థలాన్ని అప్పగించేశారు. ఇప్పుడక్కడ పునాదులు లేచాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టూరిజం ప్రమోషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా కట్టబెట్టేయడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం ఈ కేటాయింపును రద్దు చేయాలని తీర్మానించింది. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  అలిపిరి అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గ ముఖద్వారం. అటువంటి చోట.. శ్రీవారి నామస్మరణ వినా మరో మాట వినిపించదు. అలాంటి అలిపిరిలో ముంతాజ్ పేరుతో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కారు చౌకగా జగన్ ప్రభుత్వం కట్టబెట్టేయడమే.. జగన్ కు హిందూ మతం పట్ల అక్కడ, శ్రద్ధ లేదని అవగతమౌతోందని హిందూ వాదులు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే జగన్ ప్రభుత్వం ముంజాత్ హోటల్ నిర్మాణం కోసం చేసిన స్థల కేటాయింపును రద్దు చేయాలని భక్తులు కోరుతున్నారు.