- నవంబర్ 24-25 తేదీల్లో వేలం
- 574 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ
- పంత్‌కు ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. తాజాగా మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మెగా వేలంపై స్పందించాడు. రిషబ్ పంత్‌కు ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా అని జోస్యం చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్ మాత్రమే కాదు వికెట్ కీపర్ కూడా అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు కూడా వేలంలో భారీ డిమాండ్ ఉందని చెప్పాడు. కొన్ని జట్లు కెప్టెన్ కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని రైనా చెప్పుకొచ్చాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో సురేష్ రైనా మాట్లాడుతూ… ‘ఓసారి ఐపీఎల్ వేలంను చూస్తే.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ భారీ డబ్బు పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎందుకు పెద్ద మొత్తం తీసుకోకూడదు. రిషబ్ పంత్ కెప్టెన్, గన్ ప్లేయర్, గన్ వికెట్ కీపర్ కూడా. పంత్ ఎండార్స్‌మెంట్ చూస్తే.. అతని బ్రాండ్ విలువ ఏంటో అర్ధమవుతుంది. పంత్‌కు 25-30 కోట్లు పలుకుతాడు. అందుకు అతడు అర్హుడు. అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా. టీమ్ ఏదైనా రిషబ్‌కు కప్ గెలవాలనే ఆటిట్యూడ్ ఉంది. ఢిల్లీ జట్టు కోసం ప్రయత్నించాడు. చాలా కష్టపడ్డాడు’ అని చెప్పాడు. బెంగళూరు, ఢిల్లీ, లక్నో, పంజాబ్ ఫ్రాంచైజీలు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా పేర్కొన్నాడు.