- నిజ్జర్ హత్య గురించి ప్రధాని మోడీకి తెలుసంటూ కెనడా వీడియో ఆరోపణ..
కెనడియన్ మీడియా ఆరోపణలు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం..
కెనడా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించిన భారత విదేశాంగ శాఖ
Canada-India Row: గత కొన్నాళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. ఇందులో నిజ్జర్ హత్య కుట్రను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పన్నారని.. ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లకు ప్లాన్ గురించి సమాచారం అందిందని సదరు కెనడియన్ ప్రభుత్వ వార్త పత్రిక ఆరోపించింది.
కాగా, కెనడియన్ అధికార మీడియా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇటువంటి మీడియా నివేదికలు హాస్యాస్పదమైందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము సాధారణంగా మీడియా నివేదికలపై వ్యాఖ్యానించాం.. అయితే, కెనడియన్ ప్రభుత్వ వార్తాపత్రిక చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను పట్టించుకోమన్నారు. ఇప్పటికే ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా రెండు (భారత్- కెనడా) దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్ర స్థాయికి తీసుకు రావొద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
అయితే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన ఈ వాదనకు కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో తెలిపింది. మిస్టర్ మోడీకి తెలిసినట్లు కెనడా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ.. భారతదేశంలోని ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు ఆయనతో ఈ హత్యల గురించి చర్చించకపోవడమే ఊహించలేనిదని కెనడియన్ అధికారి ఒకరు చెప్పారు.